* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

13, అక్టోబర్ 2011, గురువారం

తెలుగు వెలుగు (గేయం)

తెలుగు వెలుగు

పల్లవి:  తెలుగు తెలుగు తెలుగు
            మన తెలుగు పలుకు వెలుగు |
            తెలుగు తెలుగు తెలుగు
            మన తెలుగు పలుకు వెలుగు ||

చ||      తెలుగున అచ్చులు పదహారు
           ఆపై హల్లులు ఇరవై ఏడు
           ఉభయాక్షరములు మూడు
           అంతస్థమ్ములు ఊష్మములంటూ
            వెరసి అక్షరాలేబది ఏడు         ||తెలుగు ||

చ||        పలకా బలపం పట్టి
            బడిలో పాదం పెట్టి
            అ ఆ ఇ ఈ ఉ ఊ
            అక్షరమాలిక దిద్ది
            అమ్మ, నాన్న , అక్క, తమ్ముడు,
            అన్న, చెల్లి పదములు నేర్చి
            వాక్యాలెన్నో కూర్చు              ||తెలుగు || 

చ||       ప్రకృతి లోని శబ్దములన్నీ
           ప్రస్ఫుటమ్ముగా పలుక నేర్చుటకు
           అనువగు అక్షరమాలికతో
          అజంత పదముల పొందికతో
          అమరి, అమరమగు భాషయె తెలుగు ||తెలుగు ||

చ||     " ర " అంటే ఒక అక్షరము
         " రా " అంటే ఒక పదము
         " రా " అంటే వద్దకు రమ్మని
         ఏకాక్షర పద వాక్యం
         " అర " లో ఉన్నది సాధు రేఫరా
         " చెఱ " లో ఉన్నది శకట రేఫరా
          పలికిన వెంటనె భావము తెలిసే
          కలికి భాష తెలుగు
          కమ్మని తేటవాగు తెలుగు            ||తెలుగు ||
 

చ||      తెలుగు పద్యములు తేనె పెరలురా
           పలుకు పలుకునను మధువులొలుకురా
           వినికిడి చేతనె వీనుల విందగు
           చదివిన కొలదీ చవులూరించును
          జగత్తునందున మహత్తరంబౌ
          జీవభాష తెలుగు; సంజీవభాష తెలుగు ||తెలుగు ||
                                                                                                                              
   రచన:
రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్)

4 కామెంట్‌లు:

  1. చంద్రశేఖర్:
    తెలుగు భాష కమ్మదనాన్ని చక్కగా వివరించారు. రెండు, మూడు చరణాలు ముందు పెట్టి, ఒకటవ చరణాన్ని మూడోదానిగా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. చిన్న పిల్లలకి ఆకర్షణీయంగా వుంటుంది. వాళ్ళ కోసం ఒకవేళ పల్లవి, రెండు చరణాలతో ఆపేసినా ప్రమాదం వుండదు.

    రిప్లయితొలగించండి
  2. అయ్యో, ఫాంట్ ఎందుకు మార్చారు? అది నా కంటికి ఎంతో అందంగా కనిపించింది. దాని వివరాలు తెలుసుకుందామని అడిగాను. మీరు మరోలా అర్థం చేసుకొని తొలగించారు.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    గేయములు చాలా బాగున్నాయి. ధన్య వాదములు

    రిప్లయితొలగించండి