తెలుగు వెలుగు
పల్లవి: తెలుగు తెలుగు తెలుగు
మన తెలుగు పలుకు వెలుగు |
తెలుగు తెలుగు తెలుగు
మన తెలుగు పలుకు వెలుగు ||
చ|| తెలుగున అచ్చులు పదహారు
ఆపై హల్లులు ఇరవై ఏడు
ఉభయాక్షరములు మూడు
అంతస్థమ్ములు ఊష్మములంటూ
వెరసి అక్షరాలేబది ఏడు ||తెలుగు ||
చ|| పలకా బలపం పట్టి
బడిలో పాదం పెట్టి
అ ఆ ఇ ఈ ఉ ఊ
అక్షరమాలిక దిద్ది
అమ్మ, నాన్న , అక్క, తమ్ముడు,
అన్న, చెల్లి పదములు నేర్చి
వాక్యాలెన్నో కూర్చు ||తెలుగు ||
చ|| ప్రకృతి లోని శబ్దములన్నీ
ప్రస్ఫుటమ్ముగా పలుక నేర్చుటకు
అనువగు అక్షరమాలికతో
అజంత పదముల పొందికతో
అమరి, అమరమగు భాషయె తెలుగు ||తెలుగు ||
చ|| " ర " అంటే ఒక అక్షరము
" రా " అంటే ఒక పదము
" రా " అంటే వద్దకు రమ్మని
ఏకాక్షర పద వాక్యం
" అర " లో ఉన్నది సాధు రేఫరా
" చెఱ " లో ఉన్నది శకట రేఫరా
పలికిన వెంటనె భావము తెలిసే
కలికి భాష తెలుగు
కమ్మని తేటవాగు తెలుగు ||తెలుగు ||
చ|| తెలుగు పద్యములు తేనె పెరలురా
పలుకు పలుకునను మధువులొలుకురా
వినికిడి చేతనె వీనుల విందగు
చదివిన కొలదీ చవులూరించును
జగత్తునందున మహత్తరంబౌ
జీవభాష తెలుగు; సంజీవభాష తెలుగు ||తెలుగు ||
రచన:
రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్)