* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

26, అక్టోబర్ 2011, బుధవారం

గులకరాళ్ళు - కొనసాగింపు

6.           అందమోక్షంబు మార్గమానందమగును,
              చిన్మయానందమందనా చిత్త ద్రఢిమ
             అవని దానిని పొందగా నగును స్వేచ్ఛ!
             మూల సూత్రమ్ము స్వేచ్ఛయే ముక్తికెపుడు!!

ముళ్ళకంపలు - కొనసాగింపు

13.              వార్తా పత్రికలనిశము
                   కీర్తించగవలెను "దొరల" 'కిమ్మ'నకుండా!!
                  స్ఫూర్తిం దోషములెంచిన
                  ఆర్తిం బొందెదరు గాక నభిఘాతులచే!!

13.            రాజ్యాంగము కొందరికిన్
                పూజ్యము, కొందరికి "పరమ పూజ్యము" కాగా
                భోజ్యము మొదలికి, రెంటకు
                త్యాజ్యంబయి వరలు నేటి తరుణమునందున్!!

14.           రంజన చెడి రైతులకున్
                బంజరులను పంచుటొక్క "బాగోతంబై"
                కుంజరనిభ భూస్వాముల
                పంజరమున చిక్కి "శల్య పంజర"మయ్యెన్!

15.          అరువది నాలుగు కళలం
               దరుదౌ "సుఖ జీవనంబు" నద్భుత కళగా
               పరిపోషింతురు "నేతలు"
               పరిపూర్ణ "కళావతంస" పండితులగుటన్!!

20, అక్టోబర్ 2011, గురువారం

గులకరాళ్ళు - కొనసాగింపు

5.        "నేత్ర గోచరమౌ విశ్వమెల్ల మిథ్య!
           కానరానట్టి బ్రహ్మమే కటిక నిజము"
           అనెడు సూత్రమ్ము మనుజుల కాకళింపు
           కాదు; యయ్యది సరళంబు కాదు కనుక!!

ముళ్ళకంపలు - కొనసాగింపు

11.          ఒక వంక విద్యలేమియు
               నొకవంకను ధనము లేమి యొరయుచునుండన్
               సకలంబగు రోగంబుల
               నికరంబులు జనపదాల నే "విధి" సాకున్!!


12.         ఒక వంక నుగ్రవాదం
              బొకవంకను మత వివాద మురకలు వేయన్;
              అకటా! లౌకికవాదము
              ప్రకటనకే ప్రాలుమాలి పరిమితమయ్యెన్!!

18, అక్టోబర్ 2011, మంగళవారం

గులకరాళ్ళు - కొనసాగింపు

4.       భుక్తికే లేని నిరుపేద మూట కట్టు
          పుణ్యమేముండు? వానికి ముక్తి లేదొ?
          రక్తి మార్గానువర్తికి రక్షణమ్మ!
         యెగుడు దిగుడు సమాజమ్ము యెవరి తీర్పు?

ముళ్ళకంపలు - కొనసాగింపు

9.   భూరి పరిశ్రమలానా
      డారయ "జాతీయ"  మనుచు నయ్యవి నడుపన్
      భారంబని ప్రై "వేటు" కు
      ధారాదత్తమ్మునేడు, ధర్మంబగునే?


10. ఎన్నో యేండ్లైనను, సం
      పన్నుల వైభవము పెరిగె, భరతావని, నా
      పన్నుల బాధలు హెచ్చెను
      సున్నర "స్వాతంత్ర్య ఫలము" చూడగనేడున్!!

చిత్ర కవిత్వం - 3

 
 
(నమనం)

మనమే మనమని మనమన
మనుమని మనుమని మనుమని మననమ్మేనా?
మన మేనమామ మామను
మునునేమిన మౌనిమౌని మోమున మనుమా!
 
 
సంక్షిప్త వ్యాఖ్య:

మనమే = మనం అందరమూ,   మనమని = శాశ్వతం కాదని, మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా, మనుమని మనుమని మనుమని =  పౌత్రునకు పౌత్రునకు పౌత్రుని (తన తర్వాత తరాల (7 తరాలు) గురించి) మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా?  (కాదు), మన మేనమామ = మన మేన మామ అయిన చంద్రుడికి, మామను  =  మామగారైన దక్షప్రజాప్రతిని, మును+నేమిన = పూర్వం శిక్షించిన, మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని ,  మోమున = ముఖస్థముగా, మనుమా! = జీవించుట  మేలు!!
* అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!

16, అక్టోబర్ 2011, ఆదివారం

గులకరాళ్ళు - కొనసాగింపు

3.  దైవమున్నను లేకున్న దానఁ గల్గు
    మేలు కీళ్ళను చర్చించనేలనింక
    "అస్తి-నాస్తి" వివాదమ్మునవల నుంచి
    వాస్తవము చూడలేనట్టివాడు జడుడు.

ముళ్ళకంపలు - కొనసాగింపు

7. అందరికీ ఆరోగ్యం
   
బందిస్తామీ శతాబ్ది యాఖరుకనుచున్
    మందుల ధర పెంచీ, సి
    బ్బందిని తగ్గంచినారు ప్రారంభముగా!! 


8. భారత దేశ ప్రగతికి
    పారిశ్రామీకరణ మవశ్యమె యైనన్
    దారుణమగు కాలుష్యపు
    కోరలో జనుల మిత్తి కోరందగునే!!



సరస్వతీ స్తవం

ఉక్త్యుక్తి

(సరస్వతీ స్తవం)

పదములు నీ పదములనిడి
పదములు పాడెదను జానపదుని విధమునన్!
పదనిస గరిమల నెరుగను
పదపడి నెపమెన్నకాంధ్రి! బ్రహ్మ పురంధ్రీ!

సంక్షిప్త వ్యాఖ్య:
ఓ ఆంధ్ర సరస్వతీ..! మాటలను నీ పదముల యందుంచి జానపదునిలా "పదాలు" పాడుతాను. ప ద ని స గరిమ = అంటే సప్త స్వరములూ, పద నిస గరిమ = అంటే మాటల గొప్పదనమూ యెరిగినవాడను కాను; అంటే సంగీత, సాహిత్యాలను తెలియని వాడను. కనక నన్ను మన్నించి దోషమెంచకు.
 ------------------------------------- 00 ------------------------------------



మహా విష్ణు స్తోత్రం

సప్తస్వర గుప్తస్తుతి

(మహా విష్ణు స్తోత్రం)
మాపా, నిగమాగమపస
దాపా, నీ పాద దాస దరి, గరిసరి, మా
పాపారి, గరిమ గని, మరి
దాపస పాదపమ, దాస దాసరిని సదా!!


సంక్షిప్త వ్యాఖ్య:

మాపా = లక్ష్మీభర్తవైన ఓ మహా విష్ణూ!, నిగమాగమపస దాపా = వేదాల సారాంశమునిచ్చినట్టి వాడా!, నీ పాద దాస దరి = నీ పాద దాసులైన వారికి (భక్తులకు) దగ్గరైన , గమ్యమైన వాడా!, గరిసరి = ఈశ్వరునకు సమానమైన వాడా! (శివకేశవాభేదం),  మా పాపారి= మా పాపములను నాశము చేయువాడా! గరిమ = గొప్పదనానికి, గని = ఖని వంటివాడా! మరిన్ =  మరి, తాపస పాదపమ = తాపసులకు కల్పవక్షం వంటివాడా!, దాస దాసరిని సదా =  నీ దాసులైన వారికి సదా దాసుడను.!!


------------------------00----------------------------

15, అక్టోబర్ 2011, శనివారం

గులకరాళ్ళు - కొనసాగింపు

2.  జననమాదిగ జీవన సరళియందు
     కష్టనష్టమ్ములొక్కచో గలుగుచుండు
     "కర్మ" యని కాక జీవనధర్మమనుచు
     అప్రమత్తత పాటించ హాయి కలుగు.

ముళ్ళకంపలు - కొనసాగింపు...

5.  బలగములె చాలు, నైతిక
     బలమేలా గద్దె లెక్క భరతావనిలో
     తెలియని దేవతనొల్లక
     తెలిసిన దెయ్యాన్ని కొల్చు తీరిదిగాదే! 
6. అధికారం మాకిస్తే
    కొదువా యుద్యోగములొక "కోటి" యటంచున్
    మొదలున్న వాటిలోనే
    పదిశాతము కోతపెట్టె భళిరాచూడన్!

14, అక్టోబర్ 2011, శుక్రవారం

సాదర ఆహ్వానం...!

ముళ్ళ కంపలు, గులకరాళ్ళు.... వీటిని కూడా ఆస్వాదించ్చచ్చండీ...! విశ్వశ్రేయః కావ్యం అన్నారుగా..! అదే బాటలో... సాహిత్యలోకానికి హితవు పలికేందుకు.. "ముళ్ళ కంపలు", "గులకరాళ్ళు" ....
రోజుకొకటి సిద్ధమవుతున్నాయ్..
చదివి మీ అభిప్రాయాన్ని అందించ ప్రార్థన.

గులకరాళ్ళు

శ్రీ కరమ్ము ప్రకృతి సిద్ధ చేష్టితములు
సకల ప్రాణులకీధరా చక్రమందు
జనన మరణాంతరార్థ జీవన విధాన
పరిధి, శాసించు, సుఖదుఃఖ కారకముల

ముళ్ళకంపలు

  1. శ్రీ భాగ్య శాలురకు, మి
    థ్యా బాబా, మౌని, యోగి, దైవఙ్ఞులకున్
    ప్రాభవము పంచి పెంచిన
    మా భారత మాత సాటి మహిలో గలదే!
  2.  కందము పద్యములన్నిట
    నందముగా నుండునన్న యార్యోక్తికి, నే
    స్పందించి వ్రాయ బూనితి
    కందములన్ వ్యంగ్య, హాస్య కౌశలమొప్పన్!
  3. బూతుల పలుకగ నొల్లను,
    నీతులు చెప్పేటి విద్య నేర్వను, కానీ
    యాతాయాత సమాజపు
    రీతుల నుడివెదను బుద్ధి రెక్కొను భంగిన్!!
  4. రహదారి విడిచి నడిచిన
    గహనములో గ్రుచ్చు "ముళ్ళ కంపల"టంచున్
    ఇహ మందున జీవించే
    సహవాసుల హెచ్చరింతు సవినయముగనే !!

     

13, అక్టోబర్ 2011, గురువారం

తెలుగు వెలుగు (గేయం)

తెలుగు వెలుగు

పల్లవి:  తెలుగు తెలుగు తెలుగు
            మన తెలుగు పలుకు వెలుగు |
            తెలుగు తెలుగు తెలుగు
            మన తెలుగు పలుకు వెలుగు ||

చ||      తెలుగున అచ్చులు పదహారు
           ఆపై హల్లులు ఇరవై ఏడు
           ఉభయాక్షరములు మూడు
           అంతస్థమ్ములు ఊష్మములంటూ
            వెరసి అక్షరాలేబది ఏడు         ||తెలుగు ||

చ||        పలకా బలపం పట్టి
            బడిలో పాదం పెట్టి
            అ ఆ ఇ ఈ ఉ ఊ
            అక్షరమాలిక దిద్ది
            అమ్మ, నాన్న , అక్క, తమ్ముడు,
            అన్న, చెల్లి పదములు నేర్చి
            వాక్యాలెన్నో కూర్చు              ||తెలుగు || 

చ||       ప్రకృతి లోని శబ్దములన్నీ
           ప్రస్ఫుటమ్ముగా పలుక నేర్చుటకు
           అనువగు అక్షరమాలికతో
          అజంత పదముల పొందికతో
          అమరి, అమరమగు భాషయె తెలుగు ||తెలుగు ||

చ||     " ర " అంటే ఒక అక్షరము
         " రా " అంటే ఒక పదము
         " రా " అంటే వద్దకు రమ్మని
         ఏకాక్షర పద వాక్యం
         " అర " లో ఉన్నది సాధు రేఫరా
         " చెఱ " లో ఉన్నది శకట రేఫరా
          పలికిన వెంటనె భావము తెలిసే
          కలికి భాష తెలుగు
          కమ్మని తేటవాగు తెలుగు            ||తెలుగు ||
 

చ||      తెలుగు పద్యములు తేనె పెరలురా
           పలుకు పలుకునను మధువులొలుకురా
           వినికిడి చేతనె వీనుల విందగు
           చదివిన కొలదీ చవులూరించును
          జగత్తునందున మహత్తరంబౌ
          జీవభాష తెలుగు; సంజీవభాష తెలుగు ||తెలుగు ||
                                                                                                                              
   రచన:
రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్)