* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

26, అక్టోబర్ 2011, బుధవారం

గులకరాళ్ళు - కొనసాగింపు

6.           అందమోక్షంబు మార్గమానందమగును,
              చిన్మయానందమందనా చిత్త ద్రఢిమ
             అవని దానిని పొందగా నగును స్వేచ్ఛ!
             మూల సూత్రమ్ము స్వేచ్ఛయే ముక్తికెపుడు!!

ముళ్ళకంపలు - కొనసాగింపు

13.              వార్తా పత్రికలనిశము
                   కీర్తించగవలెను "దొరల" 'కిమ్మ'నకుండా!!
                  స్ఫూర్తిం దోషములెంచిన
                  ఆర్తిం బొందెదరు గాక నభిఘాతులచే!!

13.            రాజ్యాంగము కొందరికిన్
                పూజ్యము, కొందరికి "పరమ పూజ్యము" కాగా
                భోజ్యము మొదలికి, రెంటకు
                త్యాజ్యంబయి వరలు నేటి తరుణమునందున్!!

14.           రంజన చెడి రైతులకున్
                బంజరులను పంచుటొక్క "బాగోతంబై"
                కుంజరనిభ భూస్వాముల
                పంజరమున చిక్కి "శల్య పంజర"మయ్యెన్!

15.          అరువది నాలుగు కళలం
               దరుదౌ "సుఖ జీవనంబు" నద్భుత కళగా
               పరిపోషింతురు "నేతలు"
               పరిపూర్ణ "కళావతంస" పండితులగుటన్!!

20, అక్టోబర్ 2011, గురువారం

గులకరాళ్ళు - కొనసాగింపు

5.        "నేత్ర గోచరమౌ విశ్వమెల్ల మిథ్య!
           కానరానట్టి బ్రహ్మమే కటిక నిజము"
           అనెడు సూత్రమ్ము మనుజుల కాకళింపు
           కాదు; యయ్యది సరళంబు కాదు కనుక!!

ముళ్ళకంపలు - కొనసాగింపు

11.          ఒక వంక విద్యలేమియు
               నొకవంకను ధనము లేమి యొరయుచునుండన్
               సకలంబగు రోగంబుల
               నికరంబులు జనపదాల నే "విధి" సాకున్!!


12.         ఒక వంక నుగ్రవాదం
              బొకవంకను మత వివాద మురకలు వేయన్;
              అకటా! లౌకికవాదము
              ప్రకటనకే ప్రాలుమాలి పరిమితమయ్యెన్!!

18, అక్టోబర్ 2011, మంగళవారం

గులకరాళ్ళు - కొనసాగింపు

4.       భుక్తికే లేని నిరుపేద మూట కట్టు
          పుణ్యమేముండు? వానికి ముక్తి లేదొ?
          రక్తి మార్గానువర్తికి రక్షణమ్మ!
         యెగుడు దిగుడు సమాజమ్ము యెవరి తీర్పు?

ముళ్ళకంపలు - కొనసాగింపు

9.   భూరి పరిశ్రమలానా
      డారయ "జాతీయ"  మనుచు నయ్యవి నడుపన్
      భారంబని ప్రై "వేటు" కు
      ధారాదత్తమ్మునేడు, ధర్మంబగునే?


10. ఎన్నో యేండ్లైనను, సం
      పన్నుల వైభవము పెరిగె, భరతావని, నా
      పన్నుల బాధలు హెచ్చెను
      సున్నర "స్వాతంత్ర్య ఫలము" చూడగనేడున్!!

చిత్ర కవిత్వం - 3

 
 
(నమనం)

మనమే మనమని మనమన
మనుమని మనుమని మనుమని మననమ్మేనా?
మన మేనమామ మామను
మునునేమిన మౌనిమౌని మోమున మనుమా!
 
 
సంక్షిప్త వ్యాఖ్య:

మనమే = మనం అందరమూ,   మనమని = శాశ్వతం కాదని, మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా, మనుమని మనుమని మనుమని =  పౌత్రునకు పౌత్రునకు పౌత్రుని (తన తర్వాత తరాల (7 తరాలు) గురించి) మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా?  (కాదు), మన మేనమామ = మన మేన మామ అయిన చంద్రుడికి, మామను  =  మామగారైన దక్షప్రజాప్రతిని, మును+నేమిన = పూర్వం శిక్షించిన, మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని ,  మోమున = ముఖస్థముగా, మనుమా! = జీవించుట  మేలు!!
* అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!